Home > రాజకీయాలు > YSRCP party: ఒంటరి పోరాటం.. అఖండ విజయం.. YCP ప్రస్థానంలో 15ఏళ్లు!

YSRCP party: ఒంటరి పోరాటం.. అఖండ విజయం.. YCP ప్రస్థానంలో 15ఏళ్లు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం ఓ సంచలనం. దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తలెత్తిన రాజకీయ పరిణామాలు, ఓ యువ నాయకుడి పోరాటం రాష్ట్రాన్ని మలుపు తిప్పింది. సరిగ్గా నేటికి YSR కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 15ఏళ్లు అయ్యింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయాన తర్వాత కాంగ్రెస్ పార్టీతో వైఎస్ జగన్‌కు వచ్చిన విభేదాల కారణంగా పార్టీ ఆవిర్భావం అయ్యింది.

2009 సెప్టెంబర్ 2న వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత, ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని మెజారిటీ ఎమ్మెల్యేలు కోరారు. అయితే, కాంగ్రెస్ హైకమాండ్ దీనికి సమ్మతించలేదు. అదే సమయంలో, తన తండ్రి మరణవార్త విని ప్రాణాలు విడిచిన కుటుంబాలను పరామర్శిస్తానని జగన్ ప్రకటించారు. దీనినే ‘ఓదార్పు యాత్ర’గా పిలిచారు. ఈ యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం అనుమతి నిరాకరించడం జగన్, కాంగ్రెస్ మధ్య విభేదాలకు దారితీసింది.

కాంగ్రెస్‌కు రాజీనామా

అధిష్టానం ఎంత చెప్పినా లెక్కచేయకుండా జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించారు. వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వైఎస్ అభిమానులను ఆయన కలిశారు. జగన్ యాత్రలో అక్కడక్కడా ఆయనకు వ్యతిరేకత కూడా వచ్చింది. కొత్తపార్టీ నుంచి కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. ఈ క్రమంలో 2010 నవంబర్ 29న కాంగ్రెస్ పార్టీకి, తన ఎంపీ పదవికి జగన్ రాజీనామా చేశారు. 2011 మార్చి 12న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ”ని అధికారికంగా ప్రకటించారు. వైఎస్సార్ ఆశయాలే లక్ష్యంగా, రాజన్న రాజ్యం తెస్తామనే నినాదంతో పార్టీ ప్రయాణం మొదలైంది.

ఉప ఎన్నికల ప్రభంజనం 

పార్టీ పెట్టిన కొద్ది కాలానికే కడప లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ 5.45 లక్షల భారీ మెజారిటీతో గెలిచి తన సత్తా చాటారు. అయితే, 2012లో అక్రమాస్తుల కేసులో జగన్ అరెస్టయి 16 నెలల పాటు చంచల్‌గూడ జైలులో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని పాదయాత్రల చేసి ప్రజల్లోకి వెళ్లారు.

2014 అసెంబ్లీలో ఓటమి
రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని అందరూ భావించారు. కానీ, టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ధాటికి వైసీపీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే, క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యారు.

ప్రజా సంకల్ప యాత్ర

2017 నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన ‘ప్రజా సంకల్ప యాత్ర’ వైసీపీ చరిత్రను మార్చేసింది. 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రలో జగన్ రాష్ట్రంలోని ప్రతి పల్లెను పలకరించారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అనే హామీతో ప్రజల్లో భరోసా కలిగించారు. ఇదే సమయంలో ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలు పేద వర్గాలను ఆకర్షించాయి.

2019 ఎన్నికలు

2019 మేలో వెలువడిన ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రికార్డు సృష్టించాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 స్థానాల్లో వైసీపీ జయకేతనం ఎగురవేసింది. అలాగే 22 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. 2019 మే 30న విజయవాడలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో, పదేళ్ల సుదీర్ఘ పోరాటం ఒక తార్కిక ముగింపుకు చేరుకుంది. తర్వాత వైసీపీ అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేరుతెచ్చుకుంది.  నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేయడంతో అవినీతి తగ్గింది. అర్హలైన వారికి పథకాలు చేరాయి.

2024లో ఘోర ఓటమి

మంత్రులు, ఎమ్మెల్యేపై గ్రౌండ్‌ లెవల్‌లో అవినీతి ఆరోపణలు  పెరిగాయి. పార్టీ అధినేత ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. దీంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. కూటమి ధాటికి తట్టుకోలేక 11 సీట్లకు పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా అంతగా పార్టీ ప్రభావం చూపలేదు. ప్రస్తుతం వైసీపీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదు. 

#YSRCP party in Andhra Pradesh #ys rajashekar reddy #jagan #ysrcp

Leave a Reply