Home > రాజకీయాలు > కేరళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి LDF యోధులు.. పినరయి విజయన్ పోటీ ఇక్కడే!

కేరళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి LDF యోధులు.. పినరయి విజయన్ పోటీ ఇక్కడే!

కేరళ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) లో ప్రధాన భాగస్వామి అయిన సీపీఐ(ఎం) తన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ ప్రచారంలో ముందంజ వేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో వరుసగా మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించాలని వామపక్ష కూటమి పట్టుదలతో ఉంది. కేరళ రాజకీయ చరిత్రలో ఏ కూటమి కూడా వరుసగా మూడుసార్లు అధికారంలోకి రాలేదు. అయితే, ఈసారి ఎల్డీఎఫ్ ఆ రికార్డును తిరగరాస్తుందని సీపీఐ ఎంపీ పి.సంతోష్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు తమను మళ్ళీ గెలిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే అభ్యర్థులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

సీట్ల సర్దుబాటు ఇలా..
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు గాను సీపీఐ(ఎం) 86 స్థానాల్లో నేరుగా పోటీ చేయాలని నిర్ణయించింది. మిగిలిన 54 స్థానాలను ఎల్డీఎఫ్ కూటమిలోని ఇతర మిత్రపక్షాలకు కేటాయించింది. అభ్యర్థుల ఎంపిక అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా, క్షేత్రస్థాయి సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని జరిగిందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ స్పష్టం చేశారు.

పినరయి, శైలజ టీచర్ వ్యూహం

పినరయి విజయన్: ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సొంత గడ్డ, పార్టీకి కంచుకోట అయిన కన్నూర్ జిల్లాలోని ధర్మదం నియోజకవర్గం నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు.
కె.కె. శైలజ: గత ఎన్నికల్లో మట్టనూర్ నుంచి రికార్డు మెజారిటీ సాధించిన మాజీ ఆరోగ్య మంత్రి కె.కె. శైలజను ఈసారి వ్యూహాత్మకంగా పేరావూర్ స్థానానికి మార్చారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి కేరళ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ (KPCC) అధ్యక్షుడు సన్నీ జోసెఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కీలక స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా ప్రతిపక్షానికి గట్టి షాక్ ఇవ్వాలని సీపీఐ(ఎం) భావిస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ 
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కేరళలో ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాల విడుదల చేయనున్నారు. కేరళతో పాటు అస్సాం, పుదుచ్చేరిల్లో కూడా ఏప్రిల్ 9నే ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.

#kerala elections 2026 #cm-pinarayi-vijayan #CPM in kerala #cpm #Kerala Assembly polls

Leave a Reply