తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలోని నవలూరులో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఒక ఇంట్లో LPG గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి మూడు ఇళ్లు పాక్షికంగా కుప్పకూలిపోయాయి. పాత మహాబలిపురం రోడ్ సమీపంలోని నవలూరు, చాముండేశ్వరి నగర్ 3వ వీధిలో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం 7:40 గంటల సమయంలో స్థానికులు ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దాన్ని విన్నారు. సంజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో గ్యాస్ లీక్ అయి, స్టవ్ వెలిగించే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. పేలుడు తీవ్రతకు ఆ ఇల్లు గ్రౌండ్ ఫ్లోర్ వరకు కుప్పకూలడమే కాకుండా, పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ ప్రమాదంలో సంజయ్ కుమార్, సోనియా దంపతుల కుమారుడు ధీరన్ (18 నెలలు), కుమార్తె కృతిక (4 ఏళ్లు) అక్కడికక్కడే మరణించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఇద్దరు బిడ్డలు కళ్లముందే విగతజీవులుగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గాయపడిన వారిలో చిన్నారుల తల్లిదండ్రులు సంజయ్ (31), సోనియా (26)తో పాటు వారి బంధువు చిత్ర (46), పొరుగున ఉంటున్న ప్రదీప్ (7) సహా మొత్తం ఏడుగురు ఉన్నారు. వీరందరికీ తీవ్రమైన కాలిన గాయాలవ్వడంతో వెంటనే చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
సహాయక చర్యలు
సమాచారం అందుకున్న వెంటనే తాళంబూర్ పోలీసులు, సిరిశేరి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని స్థానికుల సహాయంతో బయటకు తీశారు. గ్యాస్ కొరత ఉంటుందనే భయంతో ఆ ఇంట్లో అదనంగా సిలిండర్లను నిల్వ ఉంచారని, వాటిలో ఒక దాని నుండి గ్యాస్ లీక్ అవ్వడమే ఈ ఘోరానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో నవలూరు ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. సిలిండర్లను నిల్వ చేసేటప్పుడు, గ్యాస్ వాసన వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
