Home > క్రైమ్ > LPG cylinders : గ్యాస్‌ సిలిండర్ల  దొంగతనం..  9 మంది పోలీసులు సస్పెండ్‌

LPG cylinders : గ్యాస్‌ సిలిండర్ల  దొంగతనం..  9 మంది పోలీసులు సస్పెండ్‌

జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో గ్యాస్ సిలిండర్ల పేలుడు ఘటన పెను సంచలనానికి దారితీసింది. ఆదివారం బైరియా మోర్ సమీపంలోని ఒక ఇంటి బేస్‌మెంట్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎల్‌పిజి సిలిండర్లు పేలిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదం జరిగిన మరుసటి రోజే స్టాక్‌యార్డ్ నుండి 43 గ్యాస్ సిలిండర్లు మాయం కావడం పోలీసుల వైఫల్యాన్ని ఎత్తిచూపింది. ఈ నిర్లక్ష్యంపై తీవ్రంగా స్పందించిన ఎస్పీ రీష్మా రమేషన్.. ఇద్దరు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు కానిస్టేబుళ్లతో సహా మొత్తం తొమ్మిది మంది పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సిలిండర్లు కనిపించకుండా పోవడం

నిజానికి పేలుడు జరిగిన సమయంలో అక్కడ 61 సిలిండర్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం తర్వాత ఆ ప్రాంతాన్ని సీజ్ చేయకుండా, కేవలం ఇద్దరు పోలీసులు రాత్రంతా కాపలా ఉన్నప్పటికీ 43 సిలిండర్లు కనిపించకుండా పోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. గ్యాస్ ఏజెన్సీ లేదా డిస్ట్రిబ్యూటర్‌పై కేసును బలహీనపరిచేందుకే ఈ సిలిండర్లను మాయం చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఏజెన్సీ ఇండేన్ కంపెనీకి చెందినదని, పండు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుట్ము గ్రామానికి చెందిన అజయ్ కుమార్ సాహు పేరు మీద ఉందని అధికారులు గుర్తించారు.

ఏజెన్సీని సస్పెండ్ చేయాలని

ఈ ఘటనపై స్పందించిన జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. సదరు గ్యాస్ ఏజెన్సీకి పండు బ్లాక్‌లో డెలివరీ చేసేందుకు లైసెన్స్ ఉన్నప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా డాల్టన్‌గంజ్ పట్టణంలో నిల్వ ఉంచి సరఫరా చేస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ సమీరా ఎస్. తెలిపారు. సదరు ఏజెన్సీని సస్పెండ్ చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులకు లేఖ రాశారు. ఆ ఏజెన్సీ కింద ఉన్న 1,834 మంది వినియోగదారులను తాత్కాలికంగా సమీపంలోని ఇతర డిస్ట్రిబ్యూటర్లకు అనుసంధానించారు. జిల్లాలో గ్యాస్ సరఫరాను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డీసీ ప్రకటించారు.

#suspend #jharkhand #LPG Cylinders Shortage #LPG Cylinders

Leave a Reply